Wednesday, September 15, 2021

ప్రముఖ విఘ్నేశ్వర ఆలయాలు

ప్రముఖ విఘ్నేశ్వర దేవాలయాలు....
( గణపతి  ఉత్సవాలు సందర్బంగా ప్రత్యేక వ్యాసం )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

విఘ్నాలు  తొలగించే వినాయకుడు
ఆదిదేవుడు.... అందరి దేవుడు!తొండమయ్యను
స్మరించుకోకుండా ఏ పని తలపెట్టలేము.
వికటుడు - వినాయకుడు -  ధూమకేతుడు - ఏకదంతుడు -  కపిల - గజకర్ణుడు - లంబోదరుడు -  గణాధ్యక్షుడు - పాలచంద్రుడు - గజాననుడు -  విఘ్నేశ్వరుడు అనేవి గణపతి శుభనామాలు. 
ఏ పేరుతో పిలిచినా పలికే  గణపయ్యకు ప్రపంచ వ్యాప్తంగా గుడులు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలు అందుకునే గణపతి ఆలయాల వివరాలు తెలుసుకుందాం..

▪️ఆంధ్రప్రదేశ్ :

రాయలసీమ

🙏🏼 కాణిపాక వరసిద్ధి గణపతి  ఆలయం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాణిపాకంలో  కొలువైన  వరసిద్ధి వినాయకుడు ప్రపంచ ప్రసిద్ధి పొంది ఉన్నాడు. ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. గణపతి విగ్రహం బావిలో వుంటుంది. అక్కడ ప్రాంగణములో మరో బావి  వున్నది. ఈ బావిలో గణపతి వాహనము ఎలుక ఉన్నది. ఇక్కడ ప్రతి ఏటా వినాయకుడి విగ్రహం పెరుగుతూ వస్తున్నది.
స్వయంభూగా వెలిసిన  ఈ గణపయ్యకు  11వ శతాబ్దంలో చోళ రాజు మొదటి కుళుత్తుంగ చోళుడు బాహుదా నది ఒడ్డున  ఆలయాన్ని నిర్మించాడు. 1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు.
ప్రతియేటా వినాయకచవితి రోజు నుండి ఆరంభమై 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఈ వరసిద్ధి ఆలయం సత్యప్రమాణాలకు నెలవు. ప్రతిరోజూ  నేరారోపణలు ఎదుర్కుంటున్న వాళ్ళు తమ నిర్దోషిత్వం నిరూపణ కోసం  ఇక్కడికి వస్తుంటారు. ఎవ్వరైనా అబద్దాలు  ప్రమాణం చేస్తే 
భగవంతుడి ఆగ్రహానికి గురవుతారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఇక్కడ చేసిన ప్రమాణాలను న్యాయ‌స్థానాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సంద‌ర్భాలు  ఉన్నాయి.
ఉదాహరణకు : తిరుపతికి చెందిన  దేశిబాబు ఉద్యోగి. పై అధికారి లంచం తీసుకున్నాడానే నేరం మోపుతూ ఉద్యోగం నుండి తొలగించాడు. తాను లంచం తీసుకోలేదని  దేశిబాబు కాణిపాకంలో  ప్రమాణం చేసాడు. న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది.

🙏🏼దశభుజగణపతి

అనంతపురం జిల్లా రాయదుర్గం కోట మెట్లకింద ఉన్న ఆలయంలో  దశభుజగణపతి త్రినేత్రుడై
కొలువై ఉన్నాడు. ఇక్కడ  వినాయకుడి విగ్రహం దశభుజాలు కలిగి భారీ విగ్రహా రూపంలో 15 అడగుల ఎత్తులో  ఉంటుంది.
14 వ శతాబ్దంలో భూపతిరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతున్నది. సాధారణంగా వినాయకుడికి తొండం ఎడమ వైపు ఉంటుంది.. ఇక్కడ మాత్రం కుడివైపు తొండంతో  ఉంటుంది..
కుడివైపు 5  చేతులు  ఉంటాయి.....మొదటి చేతిలో నారికేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి.
ఎడమవైపు 5 చేతులు ఉంటాయి.....మొదటి చేతిలో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకున్నట్టు, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, అయిదో చేతిలో ఖడ్గం ఉంటాయి .
ప్రతి ఆది,మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

🙏🏼సాక్షి గణపతి :

శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి.... సాక్షి గణపతి .ద్వాపరయుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు స్థల పురాణం చెబుతున్నది.శ్రీనాథుని కాశీఖండంలో సాక్షి గణపతి గురించి ప్రస్తావించబడింది. అక్షరాలను లిఖిస్తున్నట్టుగా ఉన్నఈ గణపతిని వ్రాతపతిగా అధర్వణ వేదం పేర్కొన్నది .

ఉత్తరాంద్ర

🙏🏼 మత్స్య గణపతి

విశాఖపట్టణం జిల్లా చోడవరంలో మత్య్సగణపతి
ఆలయం ఉన్నది. ఇక్కడ గణపతి స్వయంభువుగా వెలిశాడు.సుమారుగా 600 ఏళ్ల క్రితం మత్స్య వంశపు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతున్నది .గర్భగుడి ద్వారంపై చేప బొమ్మలు ఉండడం కారణంగా మత్స్య గణపతిగా పేరు పొందాడు.గణపతి విగ్రహంనీటి ఊటలో ఉంటుంది  నడుము భాగం వరకు మాత్రమే కనిపిస్తుంది. తొండం చివరి భాగం కూడా కనిపించదు.

కోస్తాంద్ర

🙏🏼వరసిద్ధి అయినవిల్లి వినాయకుడు

తూర్పుగోదావరి అమలాపురానికి కేవలం 12 కి.మీ దూరంలో ఉన్న అయినవిల్లిలో వరసిద్ది వినాయకుడు స్వయంభూగా కొలువై ఉన్నాడు. స్థల పురాణం ప్రకారం స్వయంభూగా వెలసిన వినాయకక్షేత్రాలలో ఇది తొలి క్షేత్రంగా,.వారణాసికి సమానమైనదిగా చెప్పబడుతున్నది.పూర్వం అయినవిల్లిలో స్వర్ణగణపతి మహాయజ్ఞం  14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది..
ఆలయం స్థల పురాణం ప్రకారం  రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

మొదటి కథ ప్రకారం - దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపినట్టుగా చెబుతారు.ఇది కృతయుగంలో వెలుగు చూసిన క్షేత్రంగా భావించబడుతున్నది 
రెండవ కథ ప్రకారం - . వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ   వినాయకుడిని ప్రతిష్ఠించాడని తెలుస్తున్నది.

🙏🏼బిక్కవోలు గణపతి ఆలయం : 

తూర్పుగోదావరి జిల్లాబిక్కవోలులో  లక్ష్మీ గణపతి స్వయంభువుగా వెలిశాడు.  840లో చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ఆలయం స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి.
గణపతి విగ్రహం ఏడు అడుగుల   ఎత్తులో ఉన్నది. భక్తులు తమ మనసులోని కోరికలను గణపతి చెవిలో చెప్పుకుని ముడుపు కట్టుకోవడం ఇక్కడి సంప్రదాయం.
ప్రచారంలో ఉన్న కథ ప్రకారం.....రాజులు నిర్మించిన   దేవాలయం నేలలో కూరుకుని ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి గణపతి కలలో కనిపించి  తన ఉనికిని తెలిపాడట. ఈ విధంగా వెలుపలికి తీయబడిన వినాయక విగ్రహం కాణిపాకంలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రతి ఏటా పెరుగుతున్నాడు అని భక్తుల విశ్వాసం.

▪️తెలంగాణ

🙏🏼సికింద్రాబాద్ గణపతి : 

సికింద్రాబాద్ లో రైల్వే నిలయం సమీపంలో ఉన్న గణపతి ఆలయం జంటనగరాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది.. ఆనాటి నిజాం ప్రభుత్వం 1824 సంవత్సరంలో మంచినీటి కోసం బావి తవ్వగా వినాయకుడు స్వయంభువుగా దర్శనమిచ్చాడు. అక్కడే గుడి నిర్మాణం జరిగింది.
1932 సంవత్సరంలో దేవాలయ ఆవరణలో
శ్రీ వల్లిసేన సుబ్రమణ్య స్వామి దేవాలయమ , శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం , శ్రీ ఆదిత్యాది నవగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి .

🙏🏼ఖైరతాబాద్ గణపతి : 

అతిపెద్ద భారీ ఉత్సవ గణేశుడిగా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణపయ్యను ప్రతిఏటా లక్షల మంది దర్శించుకుంటారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తండోపదండలుగా గణపతిని చూసేందుకు తరలివస్తారు. అప్పట్లో  బాలగంగాధరతిలక్, సుభాష్ చబుద్రబోస్ వంటి దేశ నాయకులు  దేశ ప్రజల్లో చైతన్యాన్ని ఐక్యతను  జాగృతి నింపి... అంకితభావాన్ని  పెంపొందించడానికి గణేష్  జయంతిని  సమైక్యంగా నిర్వహించడం మొదలెట్టారు.  దేశ ప్రజలు అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారు ఈ  స్ఫూర్తితోనే  1954 లో అప్పటి  ఖైరతాబాదు   కౌన్సిలర్ సింగరి శంకరయ్య సమైక్య గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు . మొదట్లో సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో ఉత్సవాలు  మొదలయ్యాయి. 
1955 లో రెండడుగుల విగ్రహం, 1956లో మూడు అడుగుల విగ్రహం, విగ్రహం ఇట్లా ఏటా ఒక అడుగు  పెంచుతూ  వచ్చారు. 1964లో  11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు  వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన సంఘటన గురించి, నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. 
ప్రతిష్టాత్మకంగా  60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ వచ్చి,  ప్రస్తుతం  ఒక్కో అడుగును తగ్గిస్తూ వస్తున్నారు. 
విగ్రహం  రూపకల్పనలో ప్రతిఏటా వైవిధ్యతను ప్రదర్శించడం ఇక్కడి ప్రత్యేకత. ఏ సంవత్సరం ఏ ప్రత్యేకత ఉంటుందో అనేది భక్త జనులకు ఒక ఎదురుచూపు ! 
అప్పట్లో సింగరి  శంకరయ్య, ఇతడి  సోదరుడు సింగరి సుదర్శన్‌ రేయింబవళ్లు ఉత్సవాలు సందర్బంగా కష్టపడేవాళ్లు. కాలక్రమంలో ఉత్సవ కమిటీ ఏర్పడింది. ప్రస్తుతం శంకరయ్య లేకపోవడంతో సింగరి సుదర్శన్ గారి ఆధ్వర్యం కొనసాగుతున్నది. 
మొదట్లో ప్రత్యేకతను ఆశిస్తూ......  
నెలరోజుల వరకు  ఉత్సవాలు నిర్వహించేవారు 1960 వరకు విగ్రహాన్ని ఏనుగుపై వూరేగిస్తూ  నిమజ్జనం చేసేవారు. వివిధ కారణాలు రీత్యా 1982లో   భాగ్యనగర్ ఉత్సవ కమిటీ 
 ఖైరతాబాద్‌ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉత్సవ నిర్వాహకులతో  చర్చించి,  11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.ఇక అప్పటినుండి 11 రోజులకు ఇక్కడి భారీ వినాయకుడు నిమజ్జనం అవుతున్నాడు. 
ప్రతి సంవత్సరం 150మంది కళాకారులు,  తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు  మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.

🙏🏼శ్వేతార్క‌మూల గణపతి :

శ్వేత = తెలుపు
అర్కం = జిల్లేడు
తెల్ల జిల్లేడు గణపతి సకల శుభాలకు నెలవుగా హిందూ సంప్రదాయంలో ఒక  నమ్మకం నెలకొని  ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వ‌రంగ‌ల్ జిల్లా కాజీపేటలో కొలువైన గ‌ణ‌ప‌తి దేవాలయం శ్వేతార్క గ‌ణ‌ప‌తి ఆల‌యంగా ప్ర‌సిద్ధి పొంది ఉన్నది . తెల్లజిల్లేడు చెట్టు మూలం  నుండి స్వ‌యంభువుగా వెలిసిన కారణంగా 
ఈ వినాయ‌కుడిని శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారు. శిల్పకారుడు శిల్పాన్ని చెక్కిన చందాన 
గణపతి ప్రతిమలో కళ్ళు , నుదురు, వ‌క్ర‌తుండం, దంతాలు, కాళ్లు, పాదాలు, అర‌చేయి, ఆస‌నం, మూషికం స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. 
ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నల్లగొండ ప్రాంతంలో వందేళ్ల కిందటి తెల్లజిల్లేడు మూలం నుంచి పుట్టుకొచ్చిన గణపయ్యను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెబుతారు.

🙏🏼 ఏకశిలా గణపతి :

 తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట  మండలం ఆవంచ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ఏకశిలా గణపతి విగ్రహం ఉన్నది.30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పులో ఉన్న ఈ భారీ శిలా విగ్రహం భారతదేశంలో ఎత్తైన గణపతి విగ్రహంగా గుర్తించబడింది..  ఐశ్వర్య గణపతిగా రైతులు ఈ వినాయకుడిని  కొలుస్తారు. విగ్రహానికి చరిత్ర ఉంది. ఈ ప్రకారం  12వ శతాబ్దంలో  పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్య మహారాజుకు సోమేశ్వరుడు, తైలంపుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు  1113లో తైలంపుడు రాజ్యపాలనకు వచ్చాక రాజధానిని అవంచకు మార్చాడు. ఆ తరువాత తన భక్తిని చాటుకుంటూ  గణపతి విగ్రహాన్ని చెక్కించాడు. విగ్రహం పనులు కొనసాగుతున్న సమయంలోనే తండ్రి విక్రమాదిత్యుడు  మరణించాడు. దీంతో తైలంపుడు  విగ్రహం పనులు మధ్యలోనే ఆపేసాడు. విగ్రహాన్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

▪️మహారాష్ట్ర :

🙏🏼 సిద్ధి వినాయక ఆలయం :

ముంబై నగరం ప్రభావతి ప్రాంతంలో  ప్రసిద్ధి గాంచిన సిద్ధివినాయకుడిని నవ సత్య గణపతి అంటారు. 1801లో ఈ ఆలయం నిర్మించబడింది.లక్ష్మణ్  వితుల్ పాటిల్ అనే కాంట్రాక్టరుచే నిర్మించబడింది.దెబాయ్ పాటిల్ అనే ధనవంతురలు ఆలయాన్ని కట్టించింది.ఆమెకు సంతానం లేదు. కానీ సిద్ధివినాయకుడిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అనే నమ్మకం  భక్తుల్లో ఉన్నది.

🙏🏼 దగ్డూ సేఠ్ హల్వాయి గణపతి ఆలయం :

పూణే పట్టణంలో  హల్వాయ్ వినాయక ఆలయం ప్రసిద్ధమైనది.. ఈ ఆలయం వెనుక ఉన్న కథను  గమనిస్తే..... దగ్డూసేఠ్ హల్వాయ్ అసలు పేరు దగదుషేఠ్  షిండే.భార్య లక్ష్మీబాయి .ఇతడు మిఠాయిల  వ్యాపారం చేసేవాడు. కర్ణాటక నుండి పూనే వచ్చి స్థిరపడ్డాడు.మరాఠీలో హల్వాయ్ అంటే మిఠాయిలు తయారు చేసే వాడు అని అర్థం. మిఠాయిల వ్యాపారంలో అభివృద్ధి చెందాడు కాబట్టి అదే అతని ఇంటిపేరుగా మారింది.వీరికి ఇద్దరు కుమారులు. రామ్ ,లక్ష్మణ్. ఇద్దరూ ప్లేగు వ్యాధితో 1893లోమరణించారు. ఈ విషాద పరిస్థితిలో 
 గురువు మాధవనాధ్ మహారాజ్  సూచన ప్రకారం  మనశ్శాంతికోసం  గణపతిని ఆలయం నిర్మించాడు. . 1893లోనే ఆలయానికి ట్రస్టు ఏర్పడింది.ట్రస్టు కింద నిరుపేద బాలలకు ఉచిత విద్య, బడుగు వ్యాపారస్తులకు ఆర్ధిక సహాయం , వృధ్ధులకు ఆవాసాలు, నిరాశ్రయులకు సహకారం, వగైరా అనేక సమాజాభివృధ్ధి సేవలు కొనసాగుతున్నాయి.
ఇక్కడ గణపతి విగ్రహం 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు వుంటుంది.   

🙏🏼  త్రిశుండ్ మయూరేశ్వర్ ఆలయం :

మ‌హారాష్ట్ర పుణేలోని సోమ్వార్ పేట్ జిల్లాలో  నజగిరి  తీరంలో గణపతి పూలే ఆలయం ఉన్నది.ముంబై కి 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది.ఇక్కడ కొలువైన వినాయ‌కుడికి 
మూడు తొండాలు, ఆరు చేతులు ఉన్నాయి   వినాయ‌కుడు నెమ‌లి వాహ‌నంపై ఆసీనుడై ఉంటాడు. ఈ ఆల‌యంలో సంక‌టహ‌ర చ‌తుర్థి, వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.
భీమ్‌జిగిరి గోసవి అనే ఒక స్థానిక భక్తుడు 1754 లో ఈ ఆలయాన్ని కట్టించినట్టుగా.... 1754లో ఆలయం నిర్మిచినప్పటికి 1770 లో మూడు తొండాలు కలిగిన వినాయకుడిని ప్రతిష్టించినట్టుగా ఆలయ చరిత్ర చెబుతున్నది.. వినాయకుడి విగ్రహం ఏకశిలనిర్మాణం. ఈ ఆలయ నిర్మాణానికి కేవలం కృష్ణశిల మాత్రమే ఉపయోగించారు .
ఆలయ చరిత్రను తెలియజేస్తూ ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి.గర్భగుడిలో ఉన్న మూడు శాసనాలో రెండు శాసనాలు దేవనాగరి లిపిలో చెక్కబడి రామేశ్వర ఆలయ స్థాపన గురించి  వివరిస్తున్నాయి. 
మరొకటి పర్షియన్ భాషలో చెక్కబడి  దేవాలయ చరిత్ర తెలియచేస్తున్నది.

▪️తమిళనాడు :

🙏🏼తిరుచిరాపల్లి నండ్రుదయన్
        వినాయక ఆలయం :

చెన్నైకి దక్షిణాన 322 కిలోమీటర్ల దూరాన ఉన్న తిరుచిరాపల్లిని  త్రిచి లేదా తిరుచ్చి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండమీద కావేరి నది ఒడ్డున వినాయక ఆలయం  ఉంటుంది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి చక్కని ఉదాహరణగా నిలుస్తున్నది.
తిరుచ్చిలోని  నండ్రుదయన్ వినాయక ఆలయం ఎప్పుడు ఎవ్వరు నిర్మించారు అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని  సుమారు 7 వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు.ఇదే శతాబ్దానికి చెందిన  తమిళ నాయనార్లు,  తిరుజ్ఞాన  పవిత్ర శ్లోకాలలో ఈ వినాయకుడు కీర్తింపబడ్డాడు.   కంచి మహా పెరియవర్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిచే కూడా కీర్తింపబడింది.  స్థూలంగా చెప్పాలంటే, తిరుచిరాపల్లిలోని నండ్రుదయన్ వినాయక ఆలయం పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.నండ్రుదయన్ వినయక దేవాలయం నిర్వహించే వార్షిక సంగీత ఉత్సవాలకి రాష్ట్రం నలుమూలల నుండి సంగీతకారులు  భక్తులు వస్తుంటారు
నండ్రుదయన్ అంటే అధిష్టాన దేవుడు ఆదిదేవుడు అని అర్థం. ఇక్కడ గణపతికి తొండం ఉండదు. నరముఖ గణపతిగా పూజలు అందుకుంటున్నాడు.

 🙏🏼స్వర్ణవల్లి సమేత నరముఖ గణపతి

తమిళనాడు రాష్ట్రం  తిలతర్పణపురి గ్రామంలోస్వర్ణవల్లి సమేత ముక్తీశ్వరర్‌ ఆలయం ఉన్నది.ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో నరముఖ గణపతిగా భక్తులకు దర్శనమిస్తాడు.
వినాయకుడు గజముఖుడు. కానీ అవేవీ లేకుండా పార్వతీదేవి  సృష్టించిన   నిజస్వరూపం  ఇక్కడ . నంది ఎదురుగా  ధ్యానముద్రలో కొలువై ఉన్నాడు.
పార్వతీదేవి సృష్టించిన బాలగణపతి తలను శివుడు ఇదే ప్రాంతంలోనే ఖండించాడనీ శివపురాణం పేర్కొంటున్నది.అందుకే ఈ ఆలయాన్ని ఆదివినాయకుడి ఆలయం అని పిలుస్తారు.  ముక్తీశ్వరర్‌ను దర్శించుకునే భక్తులకు కాశీ, రామేశ్వరం, గయ వంటి ప్రాంతాలను సందర్శించిన పుణ్యం లభిస్తుందనీ, ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందనీ స్థల పురాణం చెబుతున్నది.

▪️కేరళ :

🙏🏼బాలకృష్ణ గణపతి :

కేర‌ళ‌ రాష్టం కొట్టాయం జిల్లా మ‌ల్లియూర్ పుణ్య‌క్షేత్రంలో కొలువైన శ్రీ మహాగణపతి దేవాలయం వైష్ణవ గణపతిగా భావించబడుతున్నది.గణపతి ఒడిలో బాలకృష్ణుడు కూర్చున్న దివ్య మంగళ స్వరూపం ఇక్కడ దర్శనమిస్తుంది.ఈ ఆలయం సాంప్రదాయ కేరళ వాస్తు ప్రకారం నిర్మించబడింది.
స్థల పురాణం ప్ర‌కారం పార్వ‌తీమాతకు సోదరుడు మ‌హావిష్ణువు. వినాయ‌కుడు మ‌హావిష్ణువుకు మేన‌ల్లుడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు శ్రీమ‌హావిష్ణువు అంశ‌. ఈ ప్రకారం వినాయకుడికి శ్రీకృష్ణుడు మేన‌మామ అవుతాడు. ఈ మేన‌మామ బాల‌కృష్ణుడి రూపంలో మేన‌ల్లుడి ఒడిలో కూర్చొని భాగ‌వతం వింటున్నట్టుగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.
వినాయ‌కుడి విగ్ర‌హంలో బాల‌కృష్ణుడు కూర్చున్న విగ్రహాన్ని శంక‌ర‌న్ నంబూద్రి గారు స్వయంగా చెక్కారు. ప్రస్తుతం ఈ విగ్ర‌హ‌మే  ఈ ఆల‌యంలో ప్ర‌ధాన విగ్ర‌హంగా పూజ‌లందుకుంటుంది. ప్రధానంగా వినాయ‌క చ‌వితిరోజు  " చ‌తుర్ధియాటు " పేరుతో పితృదోష ప‌రిహార పూజ‌లు జ‌రుపుతారు.  తులాభార మొక్కులు కూడా తీర్చుకుంటారు.

 ▪️కర్ణాటక

🙏🏼 మ‌ధుర్ మ‌హాగ‌ణ‌ప‌తి ఆల‌యం :

కేర‌ళ, క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్రాంతం, కాస‌ర్ గోడ్ జిల్లా,  మ‌ధుర్ గ్రామంలో స్వ‌యంభువుగా శివదేవుడు 
వెలిసాడు. ప్ర‌ధాన మూల విరాట్టు శంకరుడు 
అయినప్పటికీ  ఇక్కడ గోడపై వెలసిన  వినాయ‌క విగ్ర‌హానికి  ప్రాధాన్యత ఉన్నది.  స్థ‌లపురాణం ప్ర‌కారం ఆల‌య పూజారి కుమారుడు ఆడుకుంటూ గ‌ర్భ‌గుడిలోకి వెళ్లి   అక్క‌డి గోడ‌పై గణపతి బొమ్మ గీసాడు . విచిత్రంగా ఆ బొమ్మ నుంచి వినాయ‌కుడి రూపం ఆవిర్భ‌వించ‌డం   విగ్ర‌హం క్రమంగా పెర‌గ‌డం మొదలయ్యింది. ఇదంతా మ‌ధుర అనే ఒక స్త్రీ గమనించి బయటకు  చెప్పింది.అందుకే ఆమె పేరు మీదుగా ఈ ఆల‌యం మ‌ధుర్ మ‌హాగ‌ణ‌ప‌తి ఆల‌యంగా ప్ర‌సిద్ధి చెందింది. గణపతి విగ్ర‌హాన్ని  తొలిసారిగా స్త్రీ చూసింది కాబ‌ట్టి.. అప్ప‌టి నుంచి ఆ ఆల‌యంలో తొలి ద‌ర్శ‌నం మ‌హిళ‌ల‌కే క‌ల్పిస్తుండ‌టం విశేషం.  స‌హ‌స్రాప్పం పేరుతో వేయి అప్పాల‌ను నివేదించే ఆచారం కూడా ఇక్క‌డ ఉంది.

🙏🏼కమండల గణపతి :

కర్ణాటక రాష్ట్రం, చిక్కమంగళూరు జిల్లా,కొప్ప పట్టణానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలోదట్టమైన అటవీ ప్రాంతంలో
 కేశవే గ్రామంలో సిద్దరామత రోడ్డులో ఉన్నది.
 కమండల గణపతి ఆలయం ఉన్నది.వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం అతి ప్రాచీనమైనది.
 స్థల పురాణం ప్రకారం....శని ప్రభావం కారణంగా పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు  చేస్తూ కుమారుడైన గణపతిని ప్రార్దించింది. తల్లి పిలుపు అందుకుని చేతిలో కమండలం ధరించి బ్రహ్మచారి రూపంలో దర్శనం ఇచ్చాడు.అందుకే కమండల గణపతి అనే పేరు వచ్చింది.. ఇక్కడ పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు.

స్వయంభువు సర్వసిద్ది వినాయకుడు:

🙏🏼 స్త్రీశక్తి గణపతి :

స్కాంద, మత్స్య, వాయు, లింగ , విష్ణు ధర్మోత్తర పురాణాల్లో వినాయకి గురించి ప్రస్తావన ఉన్నది.
స్త్రీరూప వినాయకుడు 64 మంది యోగినులలో ఒకరుగా  పురాణాలు చెబుతున్నాయి.

వనదుర్గ ఉపనిషత్తులో కూడా గణపతి మహిళా స్వరూపం గురించి వివరించబడింది..

గణపతి శక్తి స్వరూపాలకు 16వ శతాబ్దం నుండి స్పషమైన రూపం ఇచ్చారు.

పార్వతీదేవి పరిచారిక పేరు మాలిని. ఈ మాలిని ముఖం ఏనుగును పోలి ఉండేది. శివ పురాణాలలో మాలినిని గణేశుని బాగోగులు చూసుకునే మహిళగా వర్ణించారు.

వినాయకుడు  స్త్రీశక్తిగా  గజానని, వినాయకి, గణేశ్వరి,  విఘ్నేశ్వరి రూపాల్లో దర్శనం ఇస్తున్న ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి.

వినాయకి -

పరశు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి  ప్రాచీన శిల్పాలలో కనిపిస్తుంది.
శివ పురాణం ప్రకారం..శివుడు అంధకాసురుడిని వధించినప్పుడు అసురుడి నెత్తురు చిందిముక్కోటి దేవతలపై పడుతుంది. ఈ సమయంలో పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయి . అలా వినాయకుడి నుంచి ఉద్భవించిన స్త్రీ రూపం వినాయకి అనేది ఒక కథ. మరో కథ ప్రకారం సుయక్ష అనే రాక్షసిని సంహరించేందుకు వినాయకుడు స్త్రీరూపాన్ని ధరించినట్లుగా కూడా పురాణాలు చెబుతున్నాయి .

వినాయకి  ప్రత్యేక ఆలయాలు లేవు.
తమిళనాడు రాష్ట్రం సుచీంద్రం, చెరియనాడ్‌ వంటి ప్రాచీన ఆలయాలలోని గోడల మీద వినాయకి శిల్పాలు కనిపిస్తాయి.

ఉత్తరప్రదేశ్లో  రిగ్యాన్  ప్రాంతంలో వినాయకి విగ్రహం ఉన్నది.
రాజస్థాన్ లో జైపూర్ , షార్టీ నగర్ లలో  వినాయకి విగ్రహాలున్నాయి .
మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ వస్తు సంగ్రహాలయంలో వినాయకి విగ్రహం ఉన్నది.
ఒరిస్సాలో షీరాపూర్ లో వినాయకి శిల్పం ఉన్నది.
___________________________________________

No comments:

Post a Comment