రెడ్డి ఆణిముత్యాలు
°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
39: డా.బెజవాడ గోపాలరెడ్డి (7-81907 - 9-3- 1997
అతడు
నిరాడంబరుడు....!
స్వచ్ఛంగా నిగర్వి..... !
తరతరాలు గుర్తుంచుకునే స్వాతంత్ర్య సమర సేనాని ....!
అడుగుజాడై నిలిచిన సారస్వత వారసత్వం.... !
తిరుగులేని రాజకీయవేత్త.... !
పదకొండు భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్న ప్రతిభాశాలి ...!
అన్నింటికీ మించి ధీశాలి !!
రాజకీయం అంటే పదవులు పొంది మిన్నకుండటం కాదు.... అంకిత భావంతో బాధ్యతలను నిర్వర్తించడమే అని క్రమశిక్షణతో చాటి చెబుతూ.... పరిపాలనాదక్షుడుగా వివిధ హోదాల్లో తనదైన ముద్ర వేసిన గోపాలరెడ్డి,
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంగ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి పట్టాభిరామిరెడ్డి, తల్లి సీతమ్మ.
శాంతి నికేతన్ లో 1924-27 ప్రాంతంలో విశ్వకవి రవీంద్రనాథుడి కవిత్వానికి ఆకర్షితుడు అయ్యాడు. కవీంద్రుడే ఆదర్శంగా తన కలానికి పదును పెట్టాడు.అప్పటికి దేశంలో జతీయోద్యమ తీవ్రత బలంగా ఉన్నది. ఈ క్రమంలో
ఒక చేత్తో జాతీయోద్యమం....రెండో చేత్తో సాహితీసేద్యం గోపాలరెడ్డిని పరిపూర్ణంగా తీర్చిదిద్ద గలిగాయి. జాతీయోద్యమంలో పాల్గొని చెరసాల జీవితం కూడా గడిపాడు. ఇక్కడ జీవిత పాఠాలు బాగా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత చురుకైన యువకుడిగా రాజాజీ మంత్రివర్గంలో సంయుక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు.
వీరి వివాహం తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మతో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పదవులు వీరిని వెదుక్కుంటూ రాగా.... కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్టానికి 1955లో ముఖ్యమంత్రిగా అతి పెద్ద బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్నారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంట గెలిచాక రచ్చ గెలిచిన తీరున 1956 తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ సారధ్యంలో రెవిన్యూ మంత్రిగా చేశారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ తర్వాత ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు నిర్విరామంగా వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.
వీరి సాహితీ ప్రస్థానాన్ని గమనిస్తే సాహితీ రంగంలో వీరు ఉద్దండులు . 1946లో తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా నియమించబడ్డారు. ఇక్కడ అక్షరానికి అదనపు గౌరవం దక్కేలా కృషిచేశారు. 1957 నుండి 1982 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సంవత్సరాలు పనిచేశారు. ఇది వీరి జీవితంలో ఒక గొప్ప కీర్తి బావుటా ! 1963 -71వరకు ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగాను కొనసాగారు.
రాజకీయం చేతిలో ఖడ్గం అయితే.... సాహిత్యం తలమీద కిరీటంగా బతికిన గోపాల్ రెడ్డి తన జీవిత కాలంలో రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించడం ఒక యజ్ఞంలా సుదీర్ఘంగా కొనసాగింది. అట్లా ఒక అనువాద రచయితగా ముద్ర పడిపోయారు. కాగా అక్షరాలు ఒద్దికగా కూర్చడం అలవాటు అయిన గోపాల్ రెడ్డి, తన
డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు.
❤ ఆమె/ఆమె జాడలు/ఆమె నీడలు/ఆమె తళుకులు/ ఆమె చెరుకులు/ గా ఆమె పంచకం వెలువరించిన గోపాల్ రెడ్డి సాహిత్యం అత్యంత సున్నితమైనది మృదు భావ సహితమైనది. చెప్పాలంటే వీరి రచన ఒక పూబాల....! కాలవాహిని/ సాహిత్య సుందరి / వచనకవితా సంపుటాలుకూడా వీరు ప్రకటించారు. వీరి '' ఆమె నవ్వింది'' రచన ఒక అద్వితీయ ప్రయోగం.
ఇట్లా సాహితీ రాజకీయ రంగాలలో తనకంటూ తిరుగులేని విశిష్ట స్థానాన్ని సంపాదించుకొని 90 వసంతాల నిండు జీవితాన్ని గడిపిన ఒక పరిపూర్ణ వ్యక్తి మన గోపాలరెడ్డి! 20 వ శతాబ్ది మొదటి పాదంలో జన్మించి చివరి వరకు జరిగిన అన్ని సామజిక సాంకేతిక రాజకీయ ఆర్థిక నాగరిక పరిణామాలు అన్నిటినీ దర్శించగలిగాడు. తన జీవితాన్ని ముందు తరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకో గలిగాడు. తానే ఒక పుస్తకంగా తన మస్తిష్కాన్ని పదును పెట్టుకోగలిగాడు.
Sunday, January 27, 2019
వర్ణమాలలో రెడ్డి
కోళ్ల పందాలు
కోళ్లు కాదు కొదమ సింహాలే
°°°°°°°°°°°°°°°°°°వివరణ*తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
కుక్కుటశాస్త్రం... !
ఇది కోళ్ల పందాలు గురించి వివరిస్తున్నది. ఈ శాస్త్రం ప్రకారం జాతిని బట్టి పందెం కోళ్లు ఆరు రకాలు. అవి 👇
1-సితావా
2-డేగ
3-నెమలి
4-కాకి
5-పర్ల
6-రసంగి
వీటిలో ఏ జాతి కోడి మరే జాతిపై ఉసిగొల్పితే విజయం వరించి తీరుతుందో శాస్త్రం స్పష్టంగా తెలియజెప్తుంది. పందెం రాయుళ్లు ఆ ప్రకారమే కోళ్ల జాతిని కొట్లాటకై ఎంపిక చేసుకుంటారు. జాతి ఆధారంగా కోళ్ల రంగులు కూడా ఉంటాయి.
కోళ్ల పందాలు కూడా మూడు రకాలు. అవి 👇
1-కత్తికట్టి పందెం
2-విడికాలు పందెం (డెంకీ పందెమ్)
3-ముసుగు పందెం ( ఈ పద్దతిలో
ఎవ్వరు ఏ కోడిని తెస్తారో ఎవ్వరికీ తెల్వకుండా ముసుగు వేసి తెస్తారు.బరిలో కోడిని ఒదిలేదాకా ఎవరిది ఏ కోడోఎవ్వరికీ తెలియదు )
ఎవ్వరి వీలును బట్టి వాళ్ళు పందెం పద్దతిని ఎంపిక చేసుకుని అనుసరిస్తారు.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఈ శాస్త్రం ప్రకారం పందెం రాయుళ్లు పుంజుల్ని సవరిస్తారు. నువ్వా నేనా అంటూ వినోదం ముసుగులో కదనభూమిని సృష్టిస్తారు.పుంజుల తరుపున తామే మీసం మెలివేస్తారు. తొడలు చరుస్తారు. ప్రేక్షకుల వెన్ను జలదరింపజేస్తారు. లక్షలు చేతులు మారేలా బెట్టింగుల పేరుతో వాతావరణాన్ని వేడిక్కిస్తారు.
అవును ! ఇదంతా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ వేళా షరా మాములుగా కనిపించే అంశం ! ప్రభుత్వం జారీచేసే నిషేదాజ్ఞలు ఇక్కడ బేఖాతరు అవుతాయి. రాజకీయ నాయకుల బడా బాబుల జోక్యం ప్రత్యక్షంగా వేడి పుట్టిస్తుంది.
కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ' సై 'అంటూ ఉసిగొల్పగానే అవి కొదమసింగాలై పోరు మొదలెడతాయి. ఎవ్వరి పుంజు గెలుస్తుందో చివరి వరకు కూడా అర్థం కాక, పందెం రాయుళ్లు లోలోపలే బెంబేలు ఎత్తిపోతుంటారు. ప్రేక్షకుల ఈలలు చప్పట్లు అరుపులు ఇవన్నీ పౌరుషాన్ని రగిలిస్తుంటాయి.
ఓడిపోయిన కోడిని "కోజ " (కోశ ) అంటారు. ఇది సంబంధిత పందెంరాయుడికి పెద్ద అవమానం. ఈ క్రమంలో ఘర్షణలు సైతం అనివార్యం అవుతున్నాయి.చెప్పాలంటే కోడి పందెం ఒక పరువు... ఒక ప్రతిష్ట... ఒక కీర్తి... ఒక కిరీటం ! అందుకే గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తూ కోళ్లకు శిక్షణ అందిస్తారు. లక్షలు ఖర్చు పెడుతూ బలమైన పౌష్టికాహారం సమకూరుస్తారు. ఈ నేపథ్యంలో కోళ్లకు వైద్య చికిత్సలు చేయిస్తారు. బలం శక్తి కోసం మాత్రలు ఇస్తారు.
అయితే పందానికి కొన్ని రోజుల ముందు కోళ్లకు తిండిని తగ్గిస్తారు. ఆకలితో కసిని రేకెత్తిస్తారు.
పందానికి ముందు సమయం, తిథి, నక్షత్రం, చూసుకుంటారు.అవిఘ్నం కోసం గణపతిని పూజిస్తారు. దృష్టి దోషాల నివారణ కోసం నల్ల కోడిని బలిస్తారు.
ఇటీవల కాలంలో కోడి పందాలు సంప్రదాయం ఇతర ప్రాంతాల్లోను మొదలైనప్పటికీ కృష్ణ... ఉభయ గోదావరి జిల్లాల పైనే అందరి దృష్టి ఉంటుంది. మొత్తానికి కోళ్ల పందెం అంటే ఒక హిసాయుత జూదం ! మూగజీవాల అరణ్య రోదన !